చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు

క్షేత్రస్థాయిలో తహసిల్దార్లకు మార్గదర్శకాలు జారీ
కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
జనగామ,మే9(జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. గ్రామాల వారిగా జాబితా రూపొందించి ఏయే గ్రామాంలో అమలు చేయనున్నది ముందుగానే సమాచారం ఇచ్చామని అన్నారు. ఈ మేరకు ఆయా మండల తహసిల్దార్లకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు.  చెక్కులను రైతులకు తప్ప వారి బంధువులకు కూడా ఇవ్వమన్నారు. చెక్కులు తీసుకునేందుకు వచ్చేటప్పడు ఆధార్‌కార్డు, పట్టాదార్‌ పాస్‌పుస్తకం జిరాక్స్‌ ప్రతులను తీసుకురావాలన్నారు. నిర్దేశించిన గ్రామాల్లో డిప్యూటి సిఎం కడియం శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు కార్యక్రమా/-లలో పాల్గొంటారు.  జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ వరకు రైతుబంధు పథకం ప్రారంభం అవుతుందన్నారు. ఇందులో భాగంగా రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకుగాను గ్రామాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతీ 300 మందికి ఒక్క కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు చెక్కులు, పట్టాదార్‌ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. రైతులు తొందరపడకుండా అధికారులకు సహకారం అందించాలన్నారు.  చెక్కులపై ఎలాంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి సమస్య పరిష్కరించు కోవాలన్నారు. చెక్కులు, పాస్‌ బుక్కులు రాని వారు తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. రెండో విడతలో వివాదాలు ఉన్న భూములు తప్ప ప్రతీ ఒక్కరికీ చెక్కులు అందిస్తామన్నారు. పాస్‌ బుక్కు రాకున్నా చెక్కులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పాస్‌ పుస్తకాల ముద్రణలో, చెక్కుల ముద్రణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఏమైనా పొరపాటు జరిగితే వాటిని సరిచేస్తామన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడొద్దన్నారు. మూడు నెలల్లోపు డబ్బులు తీసుకోవచ్చన్నారు. పాస్‌ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసే ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకు వీఆర్‌వో, వీఆర్‌ఏలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు
అందించాలన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డితో కలిసి రెవెన్యూ, వ్యవసాయాధికారులకు చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీపై అవగాహన కల్పించామని అన్నారు.