చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్‌

కామారెడ్డి,మే8(జ‌నం సాక్షి): రైతు బంధు చెక్కుల పంపిణీ పక్రియఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తామని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలోని రైతులకు రూ.196 కోట్ల 52 లక్షలు అందజేయనున్నామని తెలిపారు. 14 వేల ఎకరాలకు సంబంధించి రికార్డుల్లో పొరపాట్లు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. ముందుగా రై తులకు టోకెన్లు అందిస్తామని, అందులో పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు. బ్యాంక్‌కు వెళ్లే ముందు చెక్కుతో పా టు ఆధార్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు.4 లక్షల 80 వేల ఎకరాలకు సంబంధించిన భూ ములకు పెట్టుబడుల సహాయం అందుతుందన్నారు. 2 లక్ష ల 45 వేల 993 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు చెప్పా రు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద 3800 ఎకరాలకు సంబంధించి రైతులకు కూడా సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా లో లక్షా 33 వేల అసైన్డ్‌ భూములున్నాయని, వాటిలో లక్షా 15 వేల ఎకరాల సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు.  జిల్లాలోని నాలుగు ప్రధాన బ్యాంకులు, రెండు కార్పొరేషన్‌ బ్యాంకుల ద్వారా రైతులకు డబ్బులు అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సిండికేట్‌ పరిధిలో భిక్కనూరు, మ ద్నూర్‌, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, నస్రుల్లాబాద్‌, గాంధారి పరిధిలో రూ.71 కోట్ల 50 లక్షలు పంపిణీ చేస్తామన్నారు. ఆంధ్రాబ్యాంకు పరిధిలోని బీబీపేట, బీర్కూర్‌, పిట్లం, నిజాంసాగర్‌, తాడ్వాయి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి ఉన్నాయని, ఈ బ్యాంకు రూ.53 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. ఎస్‌బీఐ పరిధిలో జుక్కల్‌, మాచారెడ్డి, సదాశివనగర్‌, రాజంపేట, రామారెడ్డి మండలాలున్నాయన్నారు. ఇదిలావుంటే జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రై తులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద పూర్తి వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో 206 సెంటర్లు ఏ ర్పాటు చేయాల్సి ఉండగా, 196 కేంద్రాలు ప్రారంభించిన ట్లు చెప్పారు.