చైనాతో వాణిజ్య డీల్ కోసం యత్నం
వాషింగ్టన్,అక్టోబర్30(జనంసాక్షి): వాణిజ్యం విషయంలో చైనాతో అమెరికా పెద్ద డీల్ కుదుర్చుకుంటుందని భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే చైనా వస్తువులపై ఇంకా దిగుమతి సుంకాలు పెరుగుతాయని హెచ్చరించారు. సెప్టెంబరులో అమెరికా 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఉత్పత్తులపై పది శాతం సుంకాలు విధించింది. ఈ ఏడాది చివరి వరకు దానిని 25శాతానికి పెంచుతామని హెచ్చరించింది. చైనా కూడా 60బిలియన్ డాలర్ల విలువ చేసే 5,207 అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని బదులిచ్చింది. ఇరు దేశాలు ఇప్పటికే పలు ఉత్పత్తులపై పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. అయితే చైనాతో ఒప్పందం కుదరకపోతే 267బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. అమెరికాను చైనా ఆర్థికంగా దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. తాము చైనా పునర్నిర్మాణానికి సహకరిస్తే.. వారు తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా చైనా ఏడాదికి సగటున 500బిలియన్ డాలర్ల చొప్పున తీసుకుపోయిందని, ఇక అలా జరగనీయమని తెలిపారు. అర్జెరటీనాలో జరిగే జీ-20 సదస్సు సందర్భంగా నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలవనున్నారని అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ వెల్లడించింది.