చైనా దౌత్య కార్యాలయంపై మెరుపుదాడి


– ఇద్దరు పోలీసులు మృతి
కరాచీ, నవంబర్‌23(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌లోని చైనా దౌత్య కార్యాలయం వద్ద గుర్తుతెలియని దుండగులు మెరుపుదాడికి దిగారు. కరాచీలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. సాయుధులైన నలుగురు వ్యక్తులు బలవంతంగా దౌత్యకార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించారనీ, అయితే చెక్‌ పాయింట్‌ వద్ద గస్తీ కాస్తున్న సిబ్బంది వారిని అడ్డుకున్నారని స్థానిక సీనియర్‌ పోలీస్‌ అధికారి జావేద్‌ ఆలం ఓదో పేర్కొన్నారు. వారిని నిలువరించే క్రమంలో ఇరువైపులా భీకర కాల్పులు చోటుచేసుకున్నాయన్నారు. దుండగుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా మరి కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని జావెద్‌ వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. దుండగులను పట్టుకునేందుకు పాక్‌ భద్రతా దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. కాగా సోషల్‌ విూడియాలో ఇప్పటికే ఈ ఘటన తాలూకు వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దుండగులు కాల్పులు జరపడంతో పాటు పలుమార్లు పేలుళ్లకు పాల్పడినట్టు శబ్ధాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహిత దేశాల్లో చైనా కూడా ఒకటి. ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్‌లో సీపీఈసీ ప్రాజెక్టు పేరుతో మౌళిక సదుపాయాల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టింది. తీరా ఇప్పుడు చైనా దౌత్యకార్యాలయంపైనే దాడి జరగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
దాడి మాపనే – బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ
పాకిస్తాన్‌లోని చైనా దౌత్యకార్యాలయంపై శుక్రవారం జరిగిన దాడి తమ పనేనని బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. ‘ఈ దాడి చేసింది మేమేనని స్పష్టం చేసింది. ఇక ముందు కూడా మా చర్యలు కొనసాగుతాయని తెలిపింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌కి చెందిన ఈ మిలిటెంట్‌ సంస్థ పేర్కొంది. కాగా పాకిస్తాన్‌లో చైనా భారీ ఎత్తున చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుకు కీలక ప్రాంతమైన బలూచిస్తాన్‌ కేంద్రంగానే బీఎల్‌ఏ మిలిటెంట్‌ సంస్థ పనిచేస్తుండడం గమనార్హం.