ఛోక్సీ కోసం..  భారత అధికారులు ఎవరూ రావట్లేదు


– మేంకూడా ఛోక్సీని వెళ్లిపొమ్మనే చెబుతున్నాం
– ఆంటిగ్వా కోర్టులో అతడి వ్యవహారముంటే పంపించడం సాధ్యంకాదు
– ఆంటిగ్వా ప్రధాని కార్యాలయం అధికారి లయన్‌ మాక్స్‌¬స్టక్‌
ఆంటిగ్వా, జనవరి28(జ‌నంసాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ అధికారుల బృందం
త్వరలో ఆంటిగ్వా వెళ్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆంటిగ్వా ప్రభుత్వం.. ఛోక్సీ కోసం భారత్‌ నుంచి అధికారులు వస్తున్నట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఆంటిగ్వా ప్రధాని కార్యాలయం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ లయన్‌ మాక్స్‌ హాస్ట్‌ ఓ ఆంగ్ల విూడియాతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ‘భారత్‌ నుంచి అధికారుల బృందం వస్తుందని మాకు ఎలాంటి సమాచారం లేదని, మా ప్రభుత్వం కూడా ఛోక్సీని వెళ్లిపొమ్మనే చెబుతోందన్నారు. అతడు మా దేశానికి అనవసర ప్రచారం తప్ప ఏవిూ ఇవ్వలేదన్నారు. అయితే ఛోక్సీ వ్యవహారం ఆంటిగ్వా కోర్టుల ముందు ఉంటే మాత్రం అతడిని భారత్‌కు పంపించడం సాధ్యం కాదని లయన్‌ హాస్ట్‌ తెలిపారు.
పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్న ఇతడిని భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఛోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. తాజాగా ఛోక్సీని తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ అధికారులు కొందరు త్వరలో ప్రత్యేక ఎయిరిండియా విమానంలో కరేబియన్‌ దీవులకు వెళ్లనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.