జకార్తా విమానం బ్లాక్ బాక్స్ లభ్యం
ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ఛాన్స్
జకార్తా,నవంబర్1(జనంసాక్షి): ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఇటీవల కుప్పకూలిన లయన్ ఎయిర్ విమానం బ్లాక్‌బాక్స్‌ను అధికారులు గుర్తించారు. విమానం బ్లాక్‌బాక్సుల్లో ఒకదాన్ని తాము గుర్తించినట్లు ఆ దేశ జాతీయ రవాణ భద్రత కమిటీ హెడ్ సొర్జాంటో తియజోనో విూడియాకు తెలిపారు. అయితే అది విమాన డేటా రికార్డరా లేదా కాక్‌పిట్ వాయిస్ రికార్డరా అనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు. గత సోమవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 189 మంది ప్రయాణికులు, సిబ్బందితో జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన లయన్ ఎయిర్ విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్నవారంతా దుర్మరణం చెందినట్లు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. మృతుల్లో భారత్‌కు చెందిన పైలట్ భవ్యే సునేజా కూడా ఉన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇండోనేషియా రెస్క్యూ దళాలు గాలింపు చేపట్టాయి. ఇప్పటికే పలువురు ప్రయాణికుల మృతదేహాలను వెలికితీయగా.. తాజాగా విమానం బ్లాక్‌బాక్స్‌ను గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంతవరకూ తెలియరాలేదు. తాజాగా లభ్యమైన బ్లాక్‌బాక్స్‌తో ప్రమాదానికి గల కారణాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.