జగన్‌తో భార్య భారతిరెడ్డి ములాఖత్‌

హైదరాబాద్‌, జూలై 5: ఆస్తుల  కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గురువారం ఉదయం ములాఖత్‌ సమయంలో కలిశారు. ఆమెతో పాటు  కొవూరు శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా  జగన్‌ను కలిశారు. ఎరువులు, విత్తనాలు, బ్యాంక్‌ రుణాలు అందక రాష్ట్ర రైతాంగం పడుతోన్న తీవ్ర ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైసూరారెడ్డి గురువారం నాడు న్యూఢిల్లీలో తెలిపారు. శరద్‌ పవార్‌తో వైఎస్‌ విజయమ్మ బృందం  భేటీ కానుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో క్రాప్‌ హాలీడే ప్రకటించడం అత్యంత దురదృష్టకమని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రివ్యూ మీటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలని శరద్‌ పవార్‌కు విజ్ఞప్తి చేయనున్నట్లు మైసూరారెడ్డి తెలిపారు. కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మధ్యాహ్నం 12.30కు శరద్‌ పవార్‌ను, సాయంత్రం ఐదు గంటలకు సివిపి ప్రదీప్‌ కుమార్‌ను కలవనున్నారు.