“జనగామ బీఆర్ఎస్ లో అసమ్మతి గళం”

టికెట్ కేటాయించకుంటే 50 వేల మందితో సభ

– ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 : జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిపై సర్వేలు నిర్వహించి సీఎం కేసీఆర్ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాలని, లేదంటే జనగామ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని ఆప్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు తెలిపారు. గురువారం మండలంలోని ఆకునూర్ గ్రామంలో అయన అనుచర వర్గీయులతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ,భవిష్యత్ కార్యాచరణ పై కార్యకర్తలతో చర్చించారు. జనగామ నియోజకవర్గంలో బడుగు,బలహీన వర్గాలకు గుర్తింపు లేకుండా పోతుందని సీఎం కేసీఆర్ బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇండిపెండెంట్ బరిలో ఉంటే తనకు కాంగ్రెస్, బిఆర్ఎస్,పార్టీల మధ్యన త్రిముక పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల నియోజకవర్గంలో సర్వేలు చేయించినప్పటికీ తమకు 70 శాతం పైగా మద్దతు తెలిపారని సూచించారు. దీనిని అధిష్టానం పరిగణలోకి తీసుకుని సర్వే రిపోర్ట్ ల ఆధారంగా టికెట్ కేటాయించాలని తెలిపారు. బీసీ పద్మశాలి సామజిక వర్గానికి చెందిన స్థానికుడినైనా తమకు టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జనగామ టిక్కెట్ కేటాయించక పోతే 50 వేల మంది కార్యకర్తలతో సభ ఏర్పాటు చేసి జనగామ బరిలో ఉంటానని సీఎం కేసీఆర్ కు తెలియచేస్తాని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఇంకా 4 సంవత్సరాల సమయం ఉందని అందుకు జనగామ బరిలో నుంచి తప్పుకోవాలని సూచించారు. బిసి లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కాబట్టి బిసి బిడ్డనైన తమకు జనగామ టిక్కెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నట్లు తెలిపారు.