జనగామ మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి మృతి
సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి సంతాపం
జనగామ,జూలై12(జనం సాక్షి ): జనగామ మాజీ ఎమ్మెల్యే కె. వరదారెడ్డి మృతిచెందారు. జనగామ మాజీ ఎమ్మెల్యే కోడూరు వరదారెడ్డి(92) ఆనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా వరదారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. వరదారెడ్డితో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా వరదారెడ్డిని కొనియాడారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో 1931లో వెంకటమ్మ-వెంకటరెడ్డి దంపతులకు వరదారెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలంలోని బుట్టరెడ్డిగూడెం (మర్రిపెల్లిగూడెం)లో జరిగింది. ఆయన సతీమణి పద్మావతి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. వరదారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. గ్రామ సర్పంచ్‌గా 1958 నుంచి 1970 వరకు వరుసగా మూడు సార్లు గెలిచారు. 1970 నుంచి 1975 వరకు కొడకండ్ల సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఎమ్జర్జెన్సీ తర్వాత 1978లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ నుంచి తన సవిూప రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాసం నారాయణపై 3600 ఓట్ల మెజారిటీతో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 1983లో రెండోసారి పోటి చేసి టీడీపీ సీపీఎం మిత్రపక్షాల అభ్యర్థి రొండ్ల లక్ష్మారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు మంచి మిత్రుడు. ఆనంతరం 2001లో టీఆర్ఎస్ ఏర్పాటులో అప్పటి ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్లో మెదక్ జిల్లా ఇన్చార్జిగా, వరంగల్ జిల్లా బాధ్యుడిగా పని చేశాడు. అనంతర కాలంలో టీఆర్ఎస్ను విభేదించి గాదే ఇన్నయ్యతో కలిసి టీఆర్పీని ఏర్పాటు చేశాడు. 2003 సంవత్సరం డిసెంబర్లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణను ఏడారి ప్రాంతంగా మారుస్తున్నాడని ఎస్సారెస్పీ, దేవాదుల కాల్వలకు నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరదా కాల్వకు నిధులు విడుదల చేయాలంటూ అసెంబ్లీ గేటు సాక్షిగా బ్లేడ్‌తో వేలు కోసుకుని నిరసన తెలిపాడు. దీంతో వరదారెడ్డికి వరదకాల్వరెడ్డి అని పేరు వచ్చింది.
తర్వాత జరిగిన పరిణామాలతో తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ రైతు సమస్యలపై ఉద్యమించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో సుమారు వారం రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టాడు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈరవెన్ను చేరువు గోదావరి జలాలతో నిండడంతో వరదారెడ్డి సంతోషానికి అంతు లేకుండా పోయింది. వరదారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామమైన ఈరవెన్నులో జరుగుతాయని ఆయన పెద్ద కుమారుడు గౌతంరెడ్డి తెలిపారు. కోడూరు వరదారెడ్డి జనగామ ప్రాంత అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేసిన మహనీయుడని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
నేటితరం రాజకీయాలకు ఆదర్శప్రాయుడని, నిరాడంబర జీవితం గడిపిన ఆయన మృతి జిల్లా ప్రజానీకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వరదారెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. వెనుకబడిన జనగామ ప్రాంతానికి సాగు నీరందించాలనే ఆశయంతో గోదావరి జలాలను తీసుకురావాలని పరితపించిన గొప్ప వ్యక్తి అని ఎర్రబెల్లి కొనియాడారు.