జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రధాని మోదీ వరాలు

దిల్లీ(జ‌నం సాక్షి): పంద్రాగస్టు కానుకగా 32 జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 15న దిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని.. అదే వేదికపై నుంచి జన్‌ధన్‌ ఖాతాదారులకు పలు ప్రయోజనాలు కల్పించనున్నారు. జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్నిరెట్టింపు చేసి రూ.10వేలకు పెంచనున్నారని సమాచారం. రూపే కార్డులు ఉన్న వారికి ఉచిత ప్రమాద బీమాను రూ.లక్షకు పెంచే సూచనలు ఉన్నాయి.గత నాలుగేళ్లలో 32.25 కోట్ల మంది జన్‌ధన్‌ ఖాతాలను తెరిచి రూ.80,674కోట్లను జమ చేశారు. ఇదే సమయంలో అటల్ పెన్షన్‌ యోజన కింద పింఛన్‌ పరిమితిని రూ.5 వేల నుంచి రూ.10లకు పెంచే అవకాశం ఉంది. నేషనల్‌ పెన్షన్‌ స్కీంలో చేరిన అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలపై అటల్‌ పెన్షన్‌ యోజన దృష్టి పెడుతోంది. ఈ స్కీంలో చేరిన వారు 60 ఏళ్లు నిండితే.. తాము జమ చేసే ప్రీమియాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5వేల వరకు పింఛను తీసుకునే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రధాని రూ.10వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.