జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు

– జలమయమైన లోతట్టు ప్రాంతాలు
– 29మందిని రక్షించిన సహాయక బృందాలు
శ్రీనగర్‌ జ‌నంసాక్షి : జమ్మూ-కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు చేరుకోవడంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న 29 మందిని రక్షించినట్లు సోమవారం పోలీసు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, సోమవారం పునరుద్దరించామని వెల్లడించారు. జిల్లాలోని నగ్రీ, చబ్బే చక్‌, జకహే?ల్‌, బిల్లావార్‌ ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు బృందంతో కలిసి ఆదివారం రాత్రి సహాయక చర్యలు చేపట్టి నలుగురు మహిళలు, 10 మంది పిల్లలతో పాటు 29 మందిని రక్షించామని అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించిన నేపథ్యంలో పోలీసులు,సహాయక బృందాలు వివిధ ప్రాంతాల్లో మోహరించబడ్డాయి. దోడా జిల్లాలో కూడా పాఠశాలలను మూసివేశారు. రాంబన్‌, ఉదంపూర్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని ఆదివారం ఉదయం మూసివేశామని, వాతావరణం మెరుగుపడటంతోనే సోమవారం పున:ప్రారంభినట్లు ట్రాఫిక్‌ శాఖ ప్రతినిథి వెల్లడించారు. స్థానిక ప్రజలకు జిల్లా పరిపాలన అధికారులు హెచ్చరికలతో కూడిన సూచనలు జారీ చేశారు.