జయలలితతో అద్వానీ భేటీ

 

న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై చర్చించేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ గురవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలితతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి పదవికి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే విషయంలో వీరిమధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మసావేశం అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రతిపాదించే విషయంలో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికపై తాము సుదీర్ఘంగా చర్చించామని, అభ్యర్థి ఎంపికలో అవకాశాలను పరిశీలిస్తున్నామని అద్వానీ తెలిపారు. శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశంలో ఈ అంశాన్ని సమీక్షిస్తామన్నారు. యూపీఏలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటం, అందులో భాగంగానే అద్వానీ, జయలలిత భేటీ ప్రాధాన్యతన సంతరించుకున్నది.