జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ పై కేజీవ్రాల్‌ ఆగ్రహం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పదేళ్ల కిందట జరిగిన టీవీ జర్నలిస్ట్‌ సౌమ్య విశ్వనాథన్‌ హ్యత్య కేసు విచారణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీరు సరిగా లేదనీ, ఆయనను మార్చాలని కేజీవ్రాల్‌ ఆదేశించారు. సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసుకు సంబంధించి 2009లో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. కాగా ఈ కేసు విచారణకు వరుసగా రెండు వాయిదాలకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ అయ్యారు. ఈ నెల 2వ తేదీన, ఈ రోజు విచారణకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పీపీ గైర్హాజరు కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ సౌమ్య విశ్వనాథన్‌ తండ్రి ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేజీవ్రాల్‌ పీపీకి షోకాజ్‌ ఇవ్వడంతో పాటు ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.