జలవనరుల కార్యాలయం కూల్చివేత
కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు
రాజమండ్రి,ఆగస్ట్28(జనం సాక్షి):ధవళేశ్వరంలో ఎంఎల్‌డీ ప్లాంటు నిర్మాణం కోసం ఆగస్టు 25న అర్ధరాత్రి జలవనరులశాఖ పరిధిలోని రివర్ కన్జర్వేషన్ కార్యాలయ భవనాన్ని కూల్చేశారు. ఈ ఘటనపై గత రెండు రోజులుగా ఆ శాఖ ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్ష మంగళవారం కూడా కొనసాగింది. దీక్షకు గ్రామస్థులతోపాటు వివిధ రాజకీయపార్టీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో ధవళేశ్వరం శాఖ అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్ బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని కూల్చిన ప్రజారోగ్య శాఖ సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జలవనరులశాఖ ఏఈ అద్దంకి సాయిరాం మాట్లాడుతూ కూల్చివేసిన భవనంలో వందేళ్ల నాటి కీలకపత్రాలు ఉన్నాయని, బ్యారేజీకి కిలోవిూటరు పరిధిలో ఎటువంటి భారీ తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. తమ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ముందుగానే ప్రజారోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. వైకాపా రాష్ట్ర నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీలకతీతంగా తామంతా ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జలవనరులశాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజు, గిరిజాల వీర్రాజు, నక్కా రాజబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.