జాడలేని అమెరికన్ టూరిస్ట్ మృతదేహం
జాన్ బాడీ కోసం గాలింపు ముమ్మరం
పోర్ట్‌బ్లెయిర్,నవంబర్23(జనంసాక్షి): అండమాన్, నికోబార్ దీవుల్లో ఒకటైన సెంటినెల్‌లోకి వెళ్లి మృత్యువాత పడిన అమెరికన్ టూరిస్ట్ జాన్ అలెన్ చౌ మృతదేహం దొరికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అతని మృతదేహాన్ని కనిపెట్టడానికి అక్కడి పోలీసులు, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఓసారి ఆ దీవి పరిసర ప్రాంతంలోకి వెళ్లి అతని జాడేమైనా తెలుస్తుందేమోనని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. శుక్రవారం మరోసారి సెంటినెల్ సవిూపంలో 15 నుంచి 16 మంది వెళ్లినట్లు డీజీపీ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. మరికొన్ని రోజులు గడిస్తే సెంటినలీస్ అతడి మృతదేహాన్ని బయటకు తీసి, తమ పద్ధతిలో హ్యాండిల్ చేస్తారని ఆయన చెప్పారు. బయటి వ్యక్తి పట్ల తమకున్న వ్యతిరేకతను వాళ్లు ఇలా తెలుపుతారని ఆయన తెలిపారు. ఈ తెగ గురించి తెలిసిన ఆంథ్రోపలజిస్ట్‌ల సాయం కూడా అధికారులు తీసుకుంటున్నారు. చౌను ఈ నెల 17న సెంటినలీస్ బాణాలతో కొట్టి చంపారు. అక్కడి తెగ వారిని క్రిస్టియానిటీలోకి మార్చడానికి అలెన్ చౌ అక్కడికి వెళ్లాడు. కొందరు మత్య్సకారులు అతన్ని అక్కడికి తీసుకెళ్లారు. ఈ నెల 15న అతన్ని ఆ సెంటినెల్ దీవికి సవిూపంలో వదిలేశారు. చౌ అక్కడి వారిని మచ్చిక చేసుకోవడానికి వాళ్లకు ఫుట్‌బాల్, చేపలు, ఆడుకునే రింగ్ ఇచ్చినట్లు ఆ మత్య్సకారులు చెప్పారు. వాళ్లు అతన్ని చివరిసారి నవంబర్ 16న చూశారు. ఆ మరుసటి రోజు చౌను బాణాలతో కొట్టి చంపి.. సవిూపంలోని బీచ్‌లో పూడ్చిపెట్టినట్లు వాళ్లు తెలిపారు. సెంటనలీస్ తెగలో సుమారు 150 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్కడికి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించారు.