జాతిని సమైక్యపర్చిన..  మ¬న్నత వ్యక్తి గాంధీజీ


– గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు
– విజయవాడను దేశంలోనే బెస్ట్‌ సిటీగా చేశాం
– దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 20 కోట్లతో ప్రణాళికలు
– డిసెంబర్‌ నాటికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేస్తాం
– త్వరలో పసుపు-కుంకుమ కింద 1.30 లక్షల పట్టాలిస్తాం
– మహిళల పేరు విూదనే పట్టాలు
– రౌడీయిజాన్ని అణిచివేశాం
– సీసీ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేశాం
– సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : జాతిని సమైక్యపర్చిన మ¬న్నత వ్యక్తి గాంధీజీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా శిఖామణి సెంటర్‌లో గాంధీ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గాంధీజీ ఆచరించిన సిద్దాంతాలు నేటికీ అనుసరణీయమన్నారు. విజయవాడను దేశంలోనే బెస్ట్‌ సిటీగా తయారు చేశామని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్‌కు రూ.75 కోట్లు కేటాయించామని చెప్పారు. విజయవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమఅవార్డు వచ్చిందని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర
వ్యాప్తంగా పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ‘జాతీయ స్థాయిలో మన నగరాలు అవార్డులు అందుకుంటున్నాయని, పరిశుభ్రనగరాలుగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్య’మని చంద్రబాబు స్పష్టం చేశారు. మన ఆలోచనల్లో మార్పు రావాలని చంద్రబాబు సూచించారు. ఇల్లును శుభ్రంగా ఊడ్చి చెత్త బయట పారబోసే ఆలోచన మారాలని అన్నారు. దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 20 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామన్నారు. త్వరలో పసుపు-కుంకుమ కింద 1.30 లక్షల పట్టాలు ఇస్తామని, మహిళల పేరు విూదనే పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేశామన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి సంఘవిద్రోహ శక్తులపై నిఘా పెట్టామని చెప్పారు. విజయవాడను ప్రశాంతమైన నగరంగా మార్చామని సీఎం తెలిపారు. రౌడీ అనేవాడు రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదన్నారు. గాంధీజీ అహింసా విధానం వల్లే దేశానికి స్వాతంత్యం వచ్చిందని, గాంధీజీని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.