జాతిపితకు ఘనంగా నివాళి

రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన రాష్ట్రప్రతి, ప్రధాని తదితరులు

న్యూఢిల్లీ,జనవరి30(జ‌నంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. జాతిపిత వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆయన సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తెలంగాణలోనూ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌ వద్ద గాంధీ విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, మంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రాంమోహన్‌, ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్సీ పొంగులేటి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వారు మౌనం పాటించారు. జాతిపిత మహత్మాగాంధీ దేశానికి స్వాతంత్యం తెచ్చి పెట్టడమే కాకుండా.. ప్రపంచానికే శాంతిదూతగా నిలిచారని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.