జాదవ్‌ను ఇరాక్ నుంచి కిడ్నాప్ చేశారు
– అందుకు భారత్ వద్ద సాక్ష్యాలున్నాయి
– జాదవ్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పాక్ ఎలాంటి ఆధారాలు చూపలేదు
– ఐసీజేలో కులభూషణ్ జాదవ్ పై విచారణ
– భారత్ తరపున వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే
– నేడు వాదనలు వినిపించనున్న పాక్
దిహేగ్, ఫిబ్రవరి18(జనంసాక్షి) : జాదవ్‌ను పాక్ ఇరాక్ నుంచి కిడ్నాప్ చేసిందని, అందుకు భారత్ వద్ద సాక్ష్యాధారాలున్నాయని మాజీ సొలిసిటర్ జనరల్ మరీశ్ సాల్వే అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తొలుత వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ అమాయక భారతీయుడిని రక్షించేందుకు వాదనలు వినిపించే అవకాశం రావడం ఆనందంగా భావిస్తున్నానని అన్నారు. కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై పాకిస్థాన్ చేపట్టిన విచారణలో పలు లోపాలున్నాయని, జాదవ్ అక్రమంగా దేశంలోకి చొరబడటంతో అరెస్టు చేసినట్లు పాక్ చెబుతోందని గుర్తుచేశారు. కానీ జాదవ్‌ను ఇరాక్ నుంచి కిడ్నాప్ చేశారని చెప్పేందుకు భారత్ వద్ద సాక్ష్యాలున్నాయని తెలిపారు. జాదవ్ విచారణకు సంబంధించిన ఎటువంటి పత్రాలను భారత్‌కు ఇవ్వలేదని, కనీసం జాదవ్‌ను కలిసేందుకు భారత్‌కు దౌత్యపరమైన అనుమతి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇలా కాన్సులర్ యాక్సెస్ లేకుండా ఆయనను కస్టడీలో కొనసాగించడం చట్టవిరుద్ధమన్నారు. ఇదొక్కటే కాదని, జాదవ్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పాక్ ఎలాంటి ఆధారాలను చూపించలేదని హరీశ్ సాల్వే వాదించారు. తొలిసారిగా 2016 మార్చిలో భారత్ కాన్సులర్ యాక్సెస్ కోరగా.. పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సాల్వే న్యాయస్థానానికి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 13సార్లు అభ్యర్థించగా ఒక్క దానికి కూడా పాక్ సమాధానం ఇవ్వలేదన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఓ ప్రచార సాధనంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సాల్వే అన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను కలిసేందుకు పాక్ వెంటనే దౌత్యపరమైన అనుమతి ఇవ్వాలన్నారు. గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్‌ను బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్లో ఉంటున్న జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది. పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. ఈ కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానం నేటి నుంచి నాలుగు రోజుల పాటు వాదనలు విననుంది. నేడు పాక్ తమ వాదనలు వినిపిస్తుంది. తిరిగి 20న మనదేశం స్పందించాక, 21న పొరుగుదేశం తుది వాదనలు వినిపిస్తుంది.