జానకీదేవి బజాజ్ అవార్డు-2022కు నామినేషన్ల ఆహ్వానం
ఖైరతాబాద్: సెప్టెంబర్ 29 (జనం సాక్షి) బజాజ్ గ్రూప్ తో కలిసి ఐఎంసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన లేడీస్ వింగ్ తన ఫ్లాగ్ షిప్ అవార్డ్ ప్రోగ్రామ్ జానకీదేవి బజాజ్ పురస్కారానికి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. గ్రామీణ వ్యాపారం, వ్యవస్థాపకత్వ అభివృద్ధి రంగానికి దోహదపడిన ఒక భారతీయ మహిళా పారిశ్రామికవేత్త సహకారాన్ని ఈ అవార్డు అభినందిస్తుంది. విజేతకు రూ.10 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రంతో పాటు సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. గ్రామీణ భారతదేశంలో జీవన పరిస్థితులను మెరుగు పరచడం కొరకు పనిచేస్తున్న మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం, గౌరవించడానికి ఐఎంసి-లేడీస్ వింగ్ జానకీదేవి బజాజ్ పురస్కార్ అందిస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో మార్పు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్న అభ్యర్థుల నుంచి దేశవ్యాప్తంగా నామినేషన్లు ఆహ్వానిస్తున్నారు. తమను తాము లేదా తమకు తెలిసిన వారిని కూడా మహిళా అభ్యర్థులు నామినేట్ చేయవచ్చు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 2022 సెప్టెంబర్ 30, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలకే ఈ అవార్డులు ఇస్తుంటారు. కానీ, గత ఏడాది కొవిడ్-19 మహమ్మారి కారణంగా కొవిడ్ వారియర్లు అయిన మహిళకు 28వ ఐఎంసి-లేడీస్ వింగ్ జానకీదేవి బజాజ్ పురస్కార్ 2021ను ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి సమయంలో 10 వేల కుటుంబాలకు రేషన్ అందించడంతో పాటు ఔషధాలు, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు నిధులు సేకరించిన శ్రీమతి దుర్గా మల్లుగుదులు(ట్రస్టీ, అనుమ్ ఫౌండేషన్, సామాజిక కార్యకర్త)కు ఈ ఏడాది జనవరిలో 28వ అవార్డును ప్రదానం చేశారు.