జిఎంఆర్‌ ఎనర్జీలో మలేషియా సంస్థకు వాటా

gmr_bw_logoహైదరాబాద్‌ : జిఎంఆర్‌ ఎనర్జీలో వాటాల కొనుగోలుకు సంబంధించి మలేషియా సంస్థ తెనగా నేషనల్‌ బెర్హాద్‌ కుదుర్చుకున్న డీల్‌ పూర్తయింది. జిఎంఆర్‌ ఎనర్జీలో 30 శాతం వాటాను 30 కోట్ల డాలర్లకు తెనగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తెనగా నగదు చెల్లింపులు, తమ వాటాల కేటాయింపు పూర్తయినట్టుగా జిఎంఆర్‌ ఎనర్జీ వెల్లడించింది. ఈ డీల్‌ ద్వారా లభించిన సొమ్మును రుణ భారం తగ్గించుకునేందుకు జిఎంఆర్‌ ఎనర్జీ వినియోగిస్తుంది.

ప్రస్తుత డీల్‌ తర్వాత జిఎంఆర్‌ ఎనర్జీలో ప్రమోటింగ్‌ సంస్థ జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా వాటా 52.14 శాతం ఉండగా, తెనగా వాటా 30 శాతం, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్ల వాటా మరో 17.86 శాతం ఉంటుంది. కొన్నేళ్లుగా దేశీయ విద్యుత రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రంగం పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసం సడలలేదని జిఎంఆర్‌ ఎనర్జీ చైర్మన్‌ జిబిఎస్‌ రాజు అన్నారు. అందుకు తెనగా ఇన్వెస్ట్‌మెంటే నిదర్శనమని చెప్పారు. విద్యుత రంగంలోకి వచ్చిన ఎఫ్‌డిఐల్లో ఇదే భారీ మొత్తమని చెప్పారు.