జిఎస్‌టి ప్రకటనల ఖర్చు..
రూ. 132.38 కోట్లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్3(జనం సాక్షి): ఒకే దేశం ఒకే పన్ను అంటూ గతేడాది జులై 1న ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి)ను ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని అన్ని రకాల వస్తువులు, సేవలపై నాలుగు శ్లాబుల్లో పన్నులను విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జిఎస్‌టిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం పలు ప్రకటనలను ఇచ్చింది. ఈ ప్రకటనల కోసం అయిన ఖర్చు రూ.132.38కోట్లని ఆర్‌టిఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. జిఎస్‌టి ప్రకటనలు, ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలు తెలపాలంటూ ఆర్‌టిఐ ద్వారా ఒక దరఖాస్తు దాఖలైంది. దీంతో రూ.126,93,97,121 ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు సమాచార, ప్రసార శాఖ తన సమాధానంలో పేర్కొంది. ఇక ఔట్‌డోర్ ప్రకటనలకు రూ.5,44,35,502 ఖర్చు చేయగా, ఎలక్టాన్రిక్ విూడియా ద్వారా ప్రకటనలకు ఎలాంటి ఖర్చు చేయలేదని వెల్లడించింది.