జిడిపి వృద్దిపై ప్రశంసలతో కష్టాలు గట్టెక్కవు
క్షేత్రస్థాయి అవగాహన లేకుండా నిర్ణయాలు
ప్రజల ఆర్థిక బాధలను అర్థం చేసుకోకుండా ప్రకటనలు
న్యూఢల్లీి,ఆగస్ట్4(జనం సాక్షి ): ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు జిడిపి వృద్ధి బాగా సాధించిన దేశాలను బాగా ప్రశంసించవచ్చు. కాని ఆ కితాబులను చూసి మురిసిపోతే ప్రమాదం. ఆర్థిక విధానాల పట్ల ఓటర్లలో విశ్వాసం లేకుండా పోతే అది సామాజికంగా తీవ్ర ప్రభావాలను చూపుతుంది. పలు దేశాల్లో ఇప్పటికే జరుగుతున్న ఉద్యమాలు, ఆందోళనలు దీనికి సంకేతం.అందుచేత ఈ జిడిపి లెక్కల్ని చూసుకుని మురిసిపోవడం మానేసి సామాన్య ప్రజల జీవితాలను మెరుగు చేయడం విూద పాలక బిజెపి పక్షం దృష్టి సారించడం మంచిది. రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాల వివరాలను పరిశీలిస్తే…1980, 1990 సంవత్సరాల మధ్య దశాబ్ద కాలంలో దేశం జిడిపిలో సాధించిన వృద్ధిలో ప్రతీ ఒక శాతానికీ సంఘటిత రంగంలో సుమారు రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు దారి తీసింది. ఆ కాలంలో జిడిపి గనుక పదిశాతం చొప్పున ప్రతీ ఏడూ పెరిగితే, ప్రతీ ఏడూ 20 లక్షల చొప్పున సంఘటిత రంగంలో ఉద్యోగాలు అదనంగా వచ్చాయన్నమాట. అదే 1990, 2000 సంవత్సరాల మధ్య కాలంలో జిడిపిలో సాధించిన ప్రతీ ఒక శాతం వృద్ధికీ కేవలం ఒక లక్ష ఉద్యోగాల చొప్పన మాత్రమే వచ్చాయి. అంటే సగానికి సగం సంఘటిత ఉద్యోగాల కల్పన పడిపోయింది. ఇక 2000, 2010 మధ్య కాలంలోనైతే, ప్రతీ ఒక శాతం జిడిపి వృద్ధికీ కేవలం 52 వేల
ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తర్వాత రిజర్వు బ్యాంకు దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేయడం ఆపివేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 1980 దశకంతో పోల్చితే ఇప్పుడు జిడిపిలో ప్రతీ ఒక శాతం వృద్ధికీ సంఘటిత ఉద్యోగాల కల్పన నాలుగో వంతుకు పడిపోయింది. అంటే సామాన్యుడికి సంబంధించినంత వరకూ ఇప్పుడున్న జిడిపి వృద్ధిరేటు ఇంతకు నాలుగు రెట్లు పెరిగితేనే 1980 నాటి స్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక సామాన్యుడి లెక్కలో 1980 కన్నా అధికంగా అభివృద్ధి జరగాలంటే జిడిపి ఇంకెన్ని రెట్లు పెరగాలో ఆలోచించండి. జిడిపి వృద్ధి రేటు అంచనా ఒక ముఖ్యమైన విషయమే కావచ్చు. కాని సామాన్యుడి జీవితానికి సంబంధించినంత వరకూ దాని ప్రాధాన్యత నాలుగు దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ప్రస్తుత కాలంలో నయా ఉదారవాద విధానాలు అమలౌతున్న కాలంలో ఆర్థికాభివృద్ధి ప్రధానంగా పెట్టుబడిని మరింత పెంచే లక్ష్యంతో ప్రధానంగా సాగుతోంది. అందుచేత అది శ్రామిక శక్తిని కొల్లగొట్టడం మరింత తీవ్రమైంది. దేశంలో అత్యధిక శాతం శ్రమజీవులే. అందుచేత దేశ ఆర్థికాభివృద్ధిలో ఆ శ్రమజీవుల వాటా తగ్గిపోతున్నప్పుడు అటువంటి వృద్ధి ఎవరికి కావాలన్నది ఆలోచించాలి. కొద్దిమంది పెట్టుబడిదారులకు మాత్రమే ప్రధానాంశంగా ఉండే జిడిపి వృద్ధిరేటు విూద అతిగా నొక్కడం, దానికి అతి ప్రాధాన్యతనివ్వడం, జిడిపి వృద్ధి సాధిస్తే చాలు, దేశం యావత్తూ వృద్ధి చెందిందని చెప్పుకోవడం ఎంతవరకూ సబబో ఆలోచన చేయాలి. జిడిపి వృద్ధిరేటును అంచనా వేయడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని గురించి ఒక నిర్దారణకు రావచ్చు. దానిని రాజకీయ పార్టీలు మరిచిపోయి జిడిపి వృద్ధి రేటు చూసి చంకలు గుద్దుకోవడం ప్రమాదకరం. ఈ వృద్ధికి, తమ జీవితాలకి ఏ సంబంధమూ లేదన్న వాస్తవాన్ని సామాన్య ఓటర్లు తెలుసుకోడానికి ఎంతో కాలం పట్టదు. ఒకసారి తెలుసుకున్నాక తిరుగుబాట్లు తప్పవు. శ్రీలంక పరిణామాలే ఇందుకు ఉదాహరణ. జిడిపి వృద్ధిలో ప్రతీ ఒక్క శాతానికీ అక్కడ కల్పించిన ఉద్యోగాలు 1990 దశకంతో పోల్చితే ఇప్పుడు అందులో సగానికన్నా తక్కువకి పడిపోయాయి. అయితే ఈ పరిస్థితి కేవలం ఇండియాకో, శ్రీలంకకో మాత్రమే పరిమితం కాలేదు.