జులై రెండోవారంలో.. నాల్గో విడత హరితహారం

మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించండి

వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌లతో సీఎస్‌ ఎస్‌కే జోషి
అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పిన కలెక్టర్‌ ఆమ్రపాలి
వరంగల్‌, జూన్‌19(జ‌నం సాక్షి ) : రాష్ట్ర వ్యాప్తంగా నాల్గో విడత హరితహారం కార్యక్రమాన్ని జులై రెండోవారం నుండి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్‌ ఎస్‌.కె. జోషి తెలిపారు.  హరితహారం కార్యక్రమం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో మంగళవారం సీఎస్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సవిూక్షించారు. వరంగల్‌ జిల్లో కలెక్టర్‌ ఆమ్రపాలి ఇతర అధికారులు పాల్గొన్నారు. నాలుగో విడతకు జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ ఆమ్రపాలి తెలిపారు. ధర్మసాగర్‌,ఎల్కతుర్తి అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలునాటుతామని అన్నారు. డిఆర్‌డివో ద్వారా పదిలక్షలు, పట్టణ ప్రాంతాల్లో పది లక్షలు మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్దం చేశామని అన్నారు.  ఈ సందర్భంగా  సిఎస్‌ మాట్లాడుతూ.. నాలుగో విడత హరితహారం జులై రెండో వారంలో ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ ఉంటుందని సీఎస్‌ తెలిపారు. హరితహారం నిర్వహణకు ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు, నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్‌ తవ్వకం పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది హరితహారంలో 39కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయని, ఆయా జిల్లాలు తక్షణమే మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఈసారి హరితహారంలో పాఠశాల పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌లకు సీఎస్‌ సూచించారు. విద్యార్థులనే ప్రతీ ఇంటికి హరితహారం వారధులుగా గుర్తించాలన్నారు. ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈతమొక్కలు నాటుకొనే రైతులకు పొలాల్లో ఉద్యానశాఖ ద్వారా డ్రిప్‌ఇరిగేషన్‌ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కోతుల బెడద నివారణకు హరితహారంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్‌ తెలిపారు. ప్రతి జిల్లా అటవీ ప్రాంతాల్లో 5 నుంచి 6లక్షల పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25, 28 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని సీఎస్‌ ఎస్‌కే జోషి పేర్కొన్నారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పార్కుల పనులు జులై 15 నుండి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లను సీఎస్‌ ఆదేశించారు. ఇకపోతే పోలీసులు, ఇతర శాఖల ద్వారా గ్రామాలు, చెరువు శిఖాలల్లో మొక్కలు నాటుతామని ఆమ్రపాలి తెలిపారు.