జేఈఈ మెయిన్స్ నిర్వహణకు 16 కేంద్రాలు
వరంగల్,ఏప్రిల్1 : జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్(జేఈఈ) మెయిన్స్-15 ప్రవేశ పరీక్షకోసం వరంగల్ నగరంలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4వ తేదీన నిర్వహించే పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుచేస్తున్నట్లు జేఈఈ-15 పరీక్ష నిర్వాహకులు పేర్కొన్నారు. . సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష పర్యవేక్షణ కోసం సీబీఎస్‌ఈకి చెందిన నిపుణులు ఇద్దరు సభ్యులు ప్రతి కేంద్రంవద్ద ఉంటారన్నారు. నగరంలో జేఈఈ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు 3వతేదీన పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ అనుమతించిందని తెలిపారు. ఏప్రిల్ 4న ఉదయం 9.30 నుంచి 12.30 గంటలవరకు పేపర్-1, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతాయన్నారు. పరీక్ష సమయం ప్రారంభానికి అరగంట ముందే కేంద్రం వద్దకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని తెలిపారు. పరీక్ష కేంద్రాలు హన్మకొండలో ప్రముఖ కూడళ్లలోనే ఏర్పాటుచేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ సేవలు, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు విభాగం సేవలు, కేంద్రాల్లో విద్యుత్తు సమస్యలు లేకుండా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ను కోరామని తెలిపారు