జైనమత సన్యాసి

తరుణ్‌ సాగర్‌ కన్నుమూత
– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
– సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి) : రెండేళ్ల క్రితం హర్యానా అసెంబ్లీలో దిగంబరంగా ప్రసంగించిన జైనసాధువు తరుణ్‌ సాగర్‌ కన్నుమూత కన్నుమూశారు. శనివారం ఉదయం 3గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తూర్పు ఢిల్లీలోని రాధాపురి జైన ఆలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన 20 రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగయ్యాక.. ఆయన మందులు తీసుకోవడం మానేశారు. సల్లేఖిని వ్రతం ద్వారా ఆహారం ముట్టుకోకుండా ఆయన ప్రాణత్యాగం చేశారని తెలుస్తోంది. తరుణ్‌సాగర్‌ అసలు పేరు పవన్‌కుమార్‌ జైన్‌. మధ్యప్రదేశ్‌లోని దామోశ్‌ జిల్లాలో 1967 జూన్‌ 26న ఆయన జన్మించారు. ప్రధాని నరేంద్రమోదీ, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే వంటి పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. 2016లో తరుణ్‌సాగర్‌ హరియాణా అసెంబ్లీలో ప్రసంగించడంపై బాలీవుడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ విశాల్‌ దాడ్లాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు, కోర్టు కేసులు ఎదుర్కోవడంతో దాడ్లాని ట్విటర్‌లో ఆయనకు క్షమాపణలు చెప్పారు.
ప్రముఖుల సంతాపం..
ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ, ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం ప్రకటించారు. జైనమత సన్యాసి తరుణ్‌సాగర్‌ ఉన్నత ఆదర్శాలు, సమాజాభివృద్ధికి అందించిన సహకారం దేశం మరచిపోదని ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. తరుణ్‌సాగర్‌ ఇక లేరనే వార్త వినడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన బోధించిన పాఠాలు, ఆదర్శాలు ఎల్లప్పుడూ మానవజాతిని ప్రభావితం చేస్తూనే ఉంటాయని కేజీవ్రాల్‌ పేర్కొన్నారు.