జోరుపెంచిన పసిడి ధరలు
రూ. 32,835కు చేరిన 10 గ్రాముల బంగారు ధర
న్యూఢిల్లీ,జనవరి(జనంసాక్షి): రూపాయి పతనం, దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో వరుసగా మూడో రోజు బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. గురువారం నాటి మార్కెట్లో రూ. 335 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 32,835కు చేరింది. అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణిస్తుండటంతో పసిడిలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావించారు. దీనికి తోడు దేశీయంగా బంగారం అమ్మకాలు పెరగడంతో ఈ లోహం ధర పెరిగిందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 565 పెరగడం గమనార్హం.అటు వెండి కూడా నేడు పసిడి దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 350 పెరిగి రూ. 39,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1290.82డాలర్లు, ఔన్సు వెండి ధర 15.55 డాలర్లు పలికింది.