టీటీడీ వివాదంపై జోక్యం చేసుకోలేం

– అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లండి
– సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్‌పై సుప్రితీర్పు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని, విముక్తి కల్గించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పూర్వపరాలను పరిశీలించిన కోర్టు స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉంటే ఇటీవల టీటీడీపై పలు వివాదాలు చుట్టు ముట్టాయి. టీటీడీ ప్రధాన మాజీ అర్చకులను తొలగించడంతో అర్చకుడి, పాలకవర్గం నడుమ మాటల యుద్ధం నడిచింది. టీటీడీలోని పలు ఆభరణాలను లెక్కలు చూపడం లేదని, గోల్‌మాల్‌ జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. వీటిని పాలక మండలిసైతం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ల నడుమ మాటల యుద్ధం సాగింది. ఈ సమయంలో టీటీడీలో జరుతున్న అక్రమాలపై, రాష్ట్ర ప్రభుత్వం తన గుప్పిట్లో టీటీడీనీ ఉంచుకోవడం సరికాదని, విముక్తి కల్పించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రింలో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీం మేం జోక్యం చేసుకోమేలని స్పష్టంచేసింది. అయితే సుప్రీంకోర్టు సూచనపై సుబ్రహ్మణ్య స్వామి ట్విటర్‌లో స్పందించారు.  తిరుపతి విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతినివ్వడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. దీంతో టీటీడీపై హైకోర్టుకు వెళ్లేందుకు సుబ్రహ్మణ్య స్వామి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.