టీ అమ్మిన వ్యక్తి ప్రధాని కాగలడు
` భారత్ ప్రజాస్వామ్య గొప్పతనం
` డీఎన్‌ఏ వ్యాక్సిన్ అందించిన తొలి దేశం భారత్
` వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనాతో చూసాం
` అఫ్గాన్‌లో తాజా పరిస్థితులపై ఆందోళన
` ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగం
న్యూయార్క్,సెప్టెంబరు 25(జనంసాక్షి):భారత్‌లో ఏళ్లుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోందని, బాల్యంలో టీ అమ్మిన వ్యక్తి ఇవాళ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారని
నరేంద్ర మోదీ తెలిపారు.భారత్.. ప్రజాస్వామ్య ప్రకాశానికి ఒక ఉదాహరణఅని, ప్రజాస్వామ్య మాతగా పేరున్న భారత్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, భారత్‌లోని వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చిందని అన్నారు.ఈ మేరకు ఐరాసలో సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. 60 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లోని పరిస్థితులను ప్రస్తావించారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలాగే అఫ్గాన్‌లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలి. ఆ దేశంలోని చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉగ్రవాదం ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళం కలపాలి. ప్రపంచ ఉగ్రవాదుల స్వర్గంగా అఫ్గాన్‌ను మారనీయకూడదు. కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని రాజకీయంగా ఆయుధంగా వాడుతున్నాయిని పాక్ పేరును ప్రస్తావించకుండా ప్రధాని మోదీ దాయాది దేశంపై విమర్శలు గుప్పించారు. భారత దేశ అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచాన్ని మారుస్తాయని చెప్పారు. వైవిధ్యమే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా మార్చింద న్నారు. ప్రజాస్వామ్యానికి భారత్‌ను మాతగా అభివర్ణించారు. వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశాం. కరోనా వల్ల మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నానని మోదీ అన్నారు. కరోనా వేళలలోనూ 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించాం. భారత్ అనేక డిజిటల్ సంస్కరణలను తీసుకొచ్చింది. భారత అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోంది. సైన్స్, టెక్నాలజీ వాడుకుని ముందుకెళ్తున్నాం. భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచాన్నే మారుస్తాయని భరోసా ఇచ్చారు. కరోనా వేళ మేం తెచ్చిన కొవిన్ యాప్ అద్భుతంగా పనిచేసింది. దేశంలోని 6 లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేశాం. ప్రపంచానికి డీఎన్‌ఏ వ్యాక్సిన్ అందించిన తొలి దేశం భారత్. 12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే డీఎన్‌ఏ టీకాను భారత్ తయారు చేసింది. త్వరలోనే ముక్కు ద్వారా ఇచ్చే టీకాను తీసుకొస్తాం. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా తయారీ చివరి దశలో ఉంది. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నామని దేశ ప్రగతిని ఐరాస వేదికగా మోదీ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్ కంపెనీలు భారత్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.