టీ ట్వంటీకి వర్షం అడ్డంకి
రద్దయిన రెండో మ్యాచ్
మెల్‌బోర్న్,నవంబర్23(జనంసాక్షి): ఇండియా, ఆస్టేల్రియా మధ్య జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేద్దామనుకున్న కోహ్లిసేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్టేల్రియా ఇన్నింగ్స్‌లో 19 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం మళ్లీ మ్యాచ్‌ను సాగనివ్వలేదు. మధ్యమధ్యలో ఆగుతూ, కురుస్తూ విసిగించింది. మొదట 19 ఓవర్లలో 137 పరుగుల టార్గెట్ విధించారు. ఆ తర్వాత దానిని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. ఈ దశలో ఆస్టేల్రియా ప్లేయర్స్ గ్రౌండ్‌లోకి వచ్చారు. టీమిండియా ఓపెనర్లు కూడా సిద్ధమవుతుండగా మరోసారి వర్షం రావడంతో చివరికి 5 ఓవర్లలో 46 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయినా వెంటనే మరోసారి వర్షం రావడంతో టీమిండియా అసలు చేజింగ్ మొదలుపెట్టక ముందే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్టేల్రియా ఇంకా 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే. వర్షం కారణంగా ఆట రద్దవ్వడం అభిమానులను నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19 ఓవర్లకు 132/7తో నిలిచింది. వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కోహ్లీసేన లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ విధానంలో 137కు సవరించారు.
టీమిండియా ఛేదన ఆరంభం అవుతుందనగా వర్షం మళ్లీ కురిసింది. మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లను అలాగే ఉంచారు. వరుణుడు కాసేపు తెరపినివ్వడం.. కవర్లు తొలగించడం.. ఆటగాళ్లు మైదానంలోకి రావడం.. మళ్లీ వర్షం రావడం ఇలా చాలాసేపు గడిచింది. సమయం లేకపోవడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను 11 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 90గా నిర్ణయించారు. మైదానం సిద్ధం కాగానే వానదేవుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కాగా వరుణుడు పట్టువిడిచేలా కనిపించకపోవడంతో చివరికి మ్యాచ్‌ను రద్దుచేశారు. గబ్బాలో జరిగిన తొలి టీ20లో ఆసీస్ తొలి బ్యాటింగ్ చేసింది. 17 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను 45 నిమిషాలు నిలిపివేశారు. డక్‌వర్త్ లూయిస్ లక్ష్యం పెరగడంతో కోహ్లీసేన 4 పరుగులు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.