టెస్టు మ్యాచ్‌లో హార్దిక్ కు అవకాశం

cu4lcbqwcaaxpbyఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిదిన ఇక్కడ ప్రారంభమయ్యే మొదటి టెస్టు మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యను ఆడించే అవకాశాలు ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే సూచనప్రాయంగా వెల్లడించాడు. బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ పేరును తోసిపుచ్చలేమని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడినప్పుడు హార్దిక్ టి-20 ఫార్మాట్‌లో ఏ విధంగా రాణిస్తాడో తెలిసిందని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన హార్దిక్ ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని చెప్పాడు. ధర్మశాలలో అద్భుతంగా బౌల్ చేస్తే, ఢిల్లీలో బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నాడని తెలిపాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌తో నిలకడగా రాణించినందువల్లే అతనికి టెస్టు జట్టులో స్థానం లభించిందన్నాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో అతని పేరు ఉండవచ్చని అంటూనే, తుది నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంటుందని స్పష్టం చేశాడు. టెస్టుల్లో సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా పరుగులు రాబట్టే ఆటగాడి అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పాడు. అసాధారణ ప్రతిభాపాటవాలున్న హార్దిక్‌కు తుది జట్టులో స్థానం సంపాదించే అర్హతలన్నీ ఉన్నాయని అన్నాడు.