ట్రంప్‌కు ఎదురుదెబ్బ
– వలసదారులపై ట్రంప్ సర్కార్ ఆదేశాలు తాత్కాలిక నిలిపివేత
వాషింగ్టన్, నవంబర్20(జనంసాక్షి): అక్రమ వసలదారులపై ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూఎస్ డిస్టిక్ట్ జడ్జి జాన్ టిగార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అమెరికాకు వచ్చే అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించే విషయంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మెక్సికో నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించే వారికి ఆశ్రయం కల్పించకుండా ట్రంప్ సర్కార్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలపై ఆంక్షలు విధిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూఎస్ డిస్టిక్ట్ జడ్జి జాన్ టిగార్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించే అంశంపై నవంబరు 9న ట్రంప్ ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. అధికారిక ప్రవేశ మార్గాల నుంచి వచ్చి అమెరికాలో ఆశ్రయం కోరిన శరణార్థుల అభ్యర్థనలను మాత్రమే అధికారులు పరిశీలించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చే వారికి ఆశ్రయం కల్పించబోమని ట్రంప్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనను సవాల్ చేస్తూ కొన్ని పౌరహక్కుల సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ నిర్ణయం వలసల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఫెడరల్ న్యాయమూర్తి టిగార్.. ట్రంప్ సర్కారు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు. వలసదారులు ఎక్కడి నుంచి దేశంలోకి ప్రవేశించినా సరే వారు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పిందని టిగార్ ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా నిబంధనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబరు 19కి వాయిదా వేసింది. అప్పటి దాకా ట్రంప్ ఆదేశాలు నిలిపివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.