ట్రంప్ భారత్‌కు రావాలనుకుంటున్నారు
– సమయం కోసం ఎదురుచూస్తున్నారు
– అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి వెల్లడి
వాషింగ్టన్, సెప్టెంబర్28(జనంసాక్షి ) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని, అయితే అందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం ట్రంప్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించారా లేదా అన్నదానిపై ఇంతవరకూ స్పష్టమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారా అని సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్‌ను విూడియా ప్రశ్నించింది. దీనికి వెల్స్ స్పందిస్తూ.. భారత్‌లో పర్యటించేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని, అయితే అందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి అమెరికా, ఇతర దేశాల్లో ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భారత పర్యటన విషయంపై శ్వేతసౌధం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, అమెరికా, భారత్‌కు చెందిన వివిధ విభాగాల అధికారుల మధ్య ఇప్పటివరకు 40సార్లు చర్చలు జరిగాయని తెలిపారు.