ట్రంప్ వలలో.. తెలుగు విద్యార్థులు
ఫెడరల్ ఏజెంట్స్ స్టింగ్ ఆపరేషన్
నకిలీ యూనివర్శిటీతో ఫేక్ వీసాల రాకెట్ గుట్టురట్టు
మధ్యవర్తులుగా వ్యవహరించిన తెలుగువారు అరెస్టు
ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో వందలాది మంది భారతీయులు
వాషింగ్టన్,జనవరి31(జనంసాక్షి): చదువు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తోన్న విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా ఝుళిపించింది. పక్కా ప్రణాళిక ప్రకారం వల వేసి పట్టుకుంది. నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వచ్చేవారి కోసం ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించిన ఫెడరల్ ఏజెంట్స్.. స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించి అక్రమ వలసదారులను గుర్తించారు. వీరిలో అత్యధికంగా తెలుగు విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అక్రమ వలసదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారి గుట్టును బయటపెట్టేందుకు ¬ంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా డెట్రాయిట్‌లో ఫర్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో నకిలీ యూనివర్శిటీని ఏర్పాటుచేసింది. ఉన్నత విద్య పేరుతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఈ ఎత్తుగడ వేశారు. దీంతో ఈ అక్రమ వలసదారుల వ్యవహారం బయటపడింది. ఈ యూనివర్శిటీలో ప్రవేశాలు ప్రారంభించి 900 మందిని విద్యార్థులుగా చేర్చుకున్నారు. వీరిలో చాలా మంది భారత్ నుంచి వచ్చిన వారే. ఈ యూనివర్శిటీలో తరగతులు జరగవు. కేవలం వారి నుంచి డబ్బు తీసుకుని విద్యార్థి వీసాలు ఇస్తారు. ఇందుకోసం 8 మంది దళారులు పనిచేశారు. ఇలా నకిలీ పత్రాలతో స్టూడెంట్ వీసా
సాధించిన వారంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేశారు. యూనివర్సిటీలో ప్రవేశం పొందిన సుమారు 600 మంది విద్యార్థులు విదేశీయులే అని అధికారులు గుర్తించారు. వీరంతా అక్రమంగా, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో యూఎస్‌లో ఉంటున్నారని, విద్యార్థుల పేరిట చలామనీ అవుతున్నారని తేల్చారు. వీరికి యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించింది ఈ ఎనిమిది మంది భారత పౌరులేనని నిర్ధారించారు. డెట్రాయిట్‌లో ఆరుగురిని, వర్జీనియా, ఫ్లోరిడాలో ఇద్దర్ని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందాల, ఫణిదీప్ కర్నాటి, ప్రేమ్ రాంపీసా, సంతోష్ శామా, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ ప్రత్తిపాటి ఉన్నారు. ఈ 8 మందితో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌కు చెందిన చాలా మంది విద్యార్థులను ఫెడరల్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉంటే గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2016లో న్యూజెర్సీలో ఇలాగే ఓ నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు తేలడంతో 21 మందిని ¬ంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది.