ట్రంప్ వ్యాఖ్యలపై సౌదీ మండిపాటు
అదేపనిగా యువరాజుపై ఆరోపణలు సహించం
లండన్,నవంబర్22(జనంసాక్షి): అమెరికన్ కాలమిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్ అయిన ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్ర ఉందని ఆరోపణలు చేయడంపై సౌదీ అరేబియా హెచ్చరించింది. సౌదీ యువరాజు ప్రమేయం ఉన్నప్పటికీ సౌదీతో సంబంధాలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ట్రంప్ వెల్లడించిన మరుసటి రోజు సౌదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఖషోగ్గి హత్యకు యువరాజే కారణమని అమెరికా సిఐఎ పేర్కొనడాన్ని సహించబోమని సౌదీ విదేశాంగ మంత్రి ఆదిల్ అల్ జుబైర్ వ్యాఖ్యానించారు. ప్రతి సౌదీ పౌరుడికి యువరాజు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అలాగే తమ యువరాజు గురించి వస్తున్న వ్యాఖ్యానాలను తాము సహించబోమని తెలిపారు. కాగా, బ్రిటన్‌కు చెందిన చెందిన ఖషోగ్గిని అక్టోబర్ 2న సౌదీ దౌత్యకార్యాలయంలో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. దీంతో ఈ కేసును విచారించిన అమెరికన్ సిఐఎ యువరాజు ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని వెల్లడించారు. ఈ కేసులో ఏడుగురు సౌదీ అధికారులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.