ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద అన్నారు.

మెదక్, సెప్టెంబర్ 3, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
ప్రాణంకన్నా విలువైనది ఏది లేదని, ఇంటి నుండి బయలు దేరేటప్పుడు ఎంత సురక్షితంగా వెళతామో తిరిగి అంతే సురక్షితంగా ఇంటికి వచ్చేలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద అన్నారు. శనివారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, విద్యార్థులకు ట్రాఫిక్ నియమనిబంధనలపై అవగాహన కల్పించి విజ్ఞానం పెంపొందించుటకు మండల న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో రవాణ శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుటలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సమాజంలో ఆటో డ్రైవర్లు, పిల్లలు కూడా ప్రధాన భూమిక అని, పిల్లలు ట్రాఫిక్ నిబంధనలు గురించి తెలుసుకుంటే మంచి భవిష్యతు ఏర్పాటు చేసుకొని సురక్షితమైన జీవితాన్ని కోనసాగించగలుగుతారని అన్నారు. నేడు రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగుపరచుకున్నామని, ఏ ప్రాంతానికైనా వెల్లగలిగేలా చక్కటి రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి తమ జీవనం కోసం ఎదో ఒక మోటారు వాహనం కలిగి ఉన్నారని అన్నారు. మనతో సహజీవనం సాగిస్తున్న పశువులు కూడా నిత్యం తిరిగే పబ్లిక్ రోడ్ లో నడపవలసి ఉంటుందని వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మన భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు రూపొందించిందని, ఆ నిబంధనలకనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని, రోడ్డుపై వెళ్లే టప్పుడు దృష్టిమరల్చరాదని అన్నారు. ఒక్కో సారి మనం ఎంతో సురక్షితంగా వాహనం నడుపుచున్న అవతలివైపు నుండి ప్రమాదం జరిగే అవకాశముంటుందని, కాబట్టి రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరు తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునేలా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనం ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలని, తప్పని సరిగా ఇన్సూరెన్స్ చేయించాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మందు త్రాగి వాహనాలు నడుపరాదని, వాహనాలు రోడ్డుపై రాష్ గా, అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపరాదని, నో పార్కింగ్ ల వద్ద వాహనాలు నిలుపరాదని సూచించారు. ప్రమాదాల వల్ల చనిపోయిన కుటుంబాలు ఎంతో బాధను అనుభవిస్తాయని, అంగవైకల్యం ఏర్పడితే వారికి జీవితాంతం సేవ చెయ్యడానికి మరో మనిషి తోడు అవసరముంటుందని అటువంటి పరిస్థితులు రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే అందరు ఆనందమయంగా జీవిస్తారని అన్నారు. మైనర్లు వాహనాలు నడుపరాదని, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ ఉపయోగించరాదని అన్నారు. మన జిల్లాలో మద్యం త్రాగి వాహనాలు నడిపే కేసులు రోజుకు 50 వరకు న్యాయస్థానికి వస్తున్నాయని, అందులో ప్రధానంగా ఆటో రిక్షాలకే సంబంధినవని, కాబట్టి ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే న్యాయ సేవ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని ఆమె తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఆటో రిక్షాలతో రోడ్డు భద్రతపై రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని న్యాయమూర్తి లక్షిమి శారదా జండా ఊపి ప్రారంభించారు.
జ్యుడిషియల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కల్పన మాట్లాడుతూ ప్రాణాలు పొతే తిరిగి తేలేమని, కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఓవర్ లోడింగ్ లేకుండా ఆటోలు నడపాలని సూచించారు.
డిఎస్పీ సైదులు మాట్లాడుతూ వాహనం ఎప్పుడు మంచి కండిషన్ లో ఉంచుకోవాలని, మితి మీరిన వేగం పనికిరాడని, మీ తప్పిదం వల్ల ఎవరు నష్టపోకుండా ఉండాలని ఆటో డ్రైవర్లకు హితవు చెప్పారు. పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద హారన్ ఉపయోగించరాదని, తప్పని సరిగా వాహనం ఇన్సూరెన్స్ చేయించాలని, లైసెన్స్ పొంది ఉండాలని సూచించారు.
జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రతి మూడు మాసాలకొకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కలిగించుటకు ఆటో, బైక్ ర్యాలీలు నిర్వహస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం పన్ను రద్దు చేసిందని, కేంద్ర ప్రభుత్వం బ్యాడ్జ్ విధానాన్ని తీసివేసిందని , నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహన లైసెన్స్ తీసుకున్న ట్రాన్స్ పోర్ట్ వాహనం నడుపవచ్చని అన్నారు. ఐతే డాక్యుమెంట్ లు సక్రమంగా పెట్టుకోవాలని, ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, ఓవర్ లోడింగ్, ఓవర్ స్పీడ్ తో ఆటోలు నడుపరాదని అన్నారు. ప్రతి వాహనదారుడు భీమా చేయించాలని 100 రూపాయలకు ఒక లక్ష భీమా ఉంటుందని, వేయి రూపాయలకు 10 లక్షల భీమా ఉంటుందని, అనుకోని సంఘటనలు జరిగితే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది సుభాష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రిచర్డ్, క్రిస్టఫర్, పట్టాన సి.ఐ. మధు, ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షులు జనార్దన్, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మెదక్ ద్వారా జారీ చేయనైనది.