డీఎస్సీ వాయిదా
` తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్ (జనంసాక్షి):హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా పడిరది. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది.మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చెప్పారు. ఇటీవల గ్రూప్` 2 పరీక్షలను సైతం టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.టీఆర్‌టీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. సెప్టెంబరు 20 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 21వరకు కొనసాగనుంది. 2`2.5 లక్షల మంది పోటీపడతారని అంచనా వేస్తున్నారు. పరీక్షలను నవంబరులో నిర్వహించకుంటే.. మళ్లీ ఫిబ్రవరి వరకూ స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టీసీఎస్ అయాన్ అప్పట్లోనే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.