డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది జైట్లీజీ

– రాఫెల్‌ ఒప్పందపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేస్తారా లేదా?
– ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : రాఫెల్‌ ఒప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేస్తారా లేదా అన్నది చెప్పడానికి తాను ఇచ్చిన గడువు దగ్గరపడుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి గుర్తుచేశారు. ఈ మేరకు రాహుల్‌ ఈ గురువారం మధ్యాహ్నం ఓ ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ జైట్లీజీ.. విూకిచ్చిన డెడ్‌లైన్‌కు ఇంకా 6 గంటల కన్నా తక్కువ సమయమే ఉంది. విూ నిర్ణయం కోసం యువ భారతం ఎదురుచూస్తోంది. ఈ విషయంపై మోదీజీ, అనిల్‌ అంబానీజీని ఒప్పించడంలో విూరు బిజీగా ఉంటారని అనుకుంటున్నాను అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌
అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని తిప్పికొడుతూ రాహుల్‌ బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. అందులో రాఫెల్‌ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై 24 గంటల్లోగా స్పందించాలని సవాలు విసిరారు. జైట్లీజీ.. మహా రాఫెల్‌ దోపిడీపై దేశం దృష్టిని మళ్లించినందుకు విూకు ధన్యవాదాలు. దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేస్తే ఎలా ఉంటుంది? సమస్య ఏంటంటే.. విూ సుప్రీం లీడరే ఆయన స్నేహితుడిని రక్షిస్తున్నారు. అందువల్ల ఇది సాధ్యపడదేమో. దీనిపై విూరు మరోసారి పునఃపరిశీలించుకొని 24గంటల్లోగా స్పందించండి. మేం ఎదురుచూస్తుంటాం’ అని రాహుల్‌ బుధవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ఆ డెడ్‌లైన్‌ దగ్గరపడుతోందంటూ రాహుల్‌ మరోసారి ట్వీట్‌ చేసి జైట్లీకి గుర్తుచేశారు.