డెల్టా వేరియంట్‌లో కొత్త మ్యుటేషన్
ఆందోళన చెందుతున్న బ్రిటన్ వాసులు
లండన్,అక్టోబర్20 (జనంసాక్షి ) : కరోనా వైరస్ మరో మార్పు సంతరించుకొంది! ఉత్పరివర్తనాల కారణంగా డెల్టా వేరియంట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. డెల్టాప్లస్ (ఏవై.4.2)గా పిలుస్తున్న మార్పు కారణంగానే బ్రిటన్‌లో కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు భావిస్తున్నారు. అయితే, నిపుణులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ‘డెల్టా వేరియంట్‌కు చెందిన ఈ484కె, ఆ484క్యూ రకం వైరస్‌లు కొద్దిరోజులుగా ఇంగ్లండ్‌లో వ్యాపిస్తున్నాయి. ఏవై.4.2 కారక కేసులూ వెలుగుచూశాయి. ఇదేవిూ పెద్ద ఆందోళనకర వైరస్ కాదు. తొలిసారిగా గత జులైలోనే ఈ వైరస్‌ను గుర్తించాం. అప్పట్నుంచి దీని వ్యాప్తిని గమనిస్తున్నాం‘ అని నిపుణులు పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం విూడియాతో మాట్లాడారు. ‘కొవిడ్ కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాలు క్రమంగా పెరుగుతుండటాన్ని గమనిస్తున్నాం. ఇందుకు ఏవై.4.2యే కారణమని తేల్చి చెప్పలేం. టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నాం. బ్రిటన్‌లో మహమ్మారి వ్యాప్తి చాలామటుకు నియంత్రణలోనే ఉంది‘ అని ఆయన వివరించారు.