ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పేలిన పవర్‌బ్యాంక్‌

– భయాందోళనతో పరుగులు తీసిన ప్రయాణీకులు
– మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు
– అనంతరం బెయిల్‌పై విడుదలైన మహిళ
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం కలకలం రేగింది. మహిళ వద్ద ఉన్న పవర్‌బ్యాంక్‌ పేలడంతో ప్రయాణికులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని డిఫెన్స్‌ కాలనీకి చెందిన మాళవిక తివారీ బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె స్పైస్‌జెట్‌ విమానంలో ధర్మశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే చెకింగ్‌ సమయంలో భద్రత సిబ్బంది ఆమె బ్యాగును పరిశీలించారు. ఏదో అనుమానాస్పదంగా కనిపించడంతో బయటకు తీశారు. అయితే అది పవర్‌ బ్యాంకు. దాన్ని తీసుకెళ్లేందుకు సిబ్బంది అభ్యంతరం తెలిపారు. దీంతో భద్రతా సిబ్బందితో జరిగిన గొడవ కారణంగా సదరు మహిళ పవర్‌బ్యాంకును తీసి బయటకు విసిరేయడంతో అది అకస్మాత్తుగా పేలింది. దీంతో అక్కడి ప్రయాణికులు భయాందోళలనలకు గురయ్యారు. దీంతో విమానాశ్రయంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొందని, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో మాళవిక తివారిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. ఇదిలా ఉంటే సెక్యురిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం చెక్‌-ఇన్‌ లగేజీలో పవర్‌బ్యాంక్‌ తీసుకెళ్లకూడదని, అదే విషయాన్ని సదరు మహిళకు తెలియజేశామని వెల్లడించారు. దాన్ని చెక్‌-ఇన్‌ లగేజీలో కాకుండా వేరే బ్యాగులో పెట్టుకొమ్మని చెప్పామని తెలిపారు. దీంతో ఆమె గొడవ పడ్డారని, అసహనానికి గురై పవర్‌బ్యాంక్‌ తీసి విసిరికొట్టారని చెప్పారు. గోడకు విసిరి కొట్టడంతో అది ఒక్కసారిగా పేలిపోయిందని వెల్లడించారు.