ఢిల్లీ పోక్సో కోర్టుకు బదిలీ అయిన ముజఫర్‌ పూర్‌ కేసు

న్యూఢిల్లీఫిబ్రవరి7(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహం కేసును పాట్నా నుండి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు సుప్రీంకోర్టు గురువారం బదిలీ చేసింది. ఈ కేసును విచారణను రెండు వారాల్లోగా ప్రారంభించి ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఢిల్లీ న్యాయమూర్తిని ఆదేశించింది. ముజఫర్‌పూర్‌లో ఒక వసతి గృహంలో నివసిస్తున్న బాలికలు భౌతిక, లైంగిక దాడులకు గురైనట్లు ముంబయికి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైనెస్స్‌ నిర్వహించిన ఆడిట్‌లో వెలుగుచూడంతో బీహార్‌ సాంఘిక సంక్షేమ శాఖ ఫిర్యాదు చేసింది. ప్రతిపక్షాలు ఆందోళనలతో బీహార్‌ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగించింది. గత ఏడాది డిసెంబర్‌లో పోక్సో చట్టం కింద నిందితులపై సిబిఐ చార్జీషీటు దాఖలు చేసింది.