ఢిల్లీ ప్రభుత్వంలో మరో చిచ్చు

 

రేషన్‌ కార్డుల తొలగింపు వ్యవహారంపై రచ్చ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆమాద్మీ ప్రభుత్వానికి, ఢిల్లీ ఉన్నతాధికారులకు మధ్య మళ్లీ చిచ్చు రగులుతున్నట్టు కనిపిస్తోంది. ఎటువంటి తనిఖీలు లేకుండానే పౌరసరఫరాల కమిషనర్‌ మహంజీత్‌ సింగ్‌ 2.9 లక్షల రేషన్‌ కార్డులను తొలగించారని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము చట్టపరమైన పక్రియలు పూర్తయిన తర్వాతే అనర్హత గల 2.48 రేషన్‌ కార్డులను తొలగించామని సింగ్‌ చెబుతున్నారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే రేషన్‌కార్డుల తొలగింపు పైనే నేతలు, అధికారుల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. తగిన పరిశీలన లేకుండానే దాదాపు 3 లక్షల కార్డులను తొలగించేందుకు ఆహార కమిషనర్‌ సింగ్‌ కంకణం కట్టుకున్నారంటూ ఏప్రిల్‌లో ఆహార, పౌర సరఫరాల మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ ఆరోపించారు. జనవరి నుంచి మార్చి వరకు అందించకుండా నిలిచిపోయిన రేషన్‌ సరఫరాను పునరుద్ధరించాలంటూ సింగ్‌కు హుస్సేన్‌ ఓ లేఖ కూడా రాశారు. ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీపై ఆమాద్మీ నేతలు చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఇటీవల సహాయనిరాకరణ చేసిన సంగతి తెలిసిందే.