తగ్గుతున్న ముడిచమురు ధరలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షిఎ): అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో దేశీయంగా కూడా చమురు ధరలు తగ్గుతున్నాయి. శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 30పైసల చొప్పున తగ్గడంతో 2018 సంవత్సరంలో నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్‌ ధరలు సరికొత్త కనిష్ఠానికి చేరాయి. రాజధాని దిల్లీ నగరంలో శనివారం లీటరు పెట్రోల్‌ ధర 29 పైసలు తగ్గి రూ.69.26పైసలకు చేరింది. కాగా నిన్న దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.69.55గా ఉంది. డిసెంబరు 24న దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ఈ ఏడాదిలో తొలిసారిగా రూ.70కి దిగువకు వెళ్లింది. నేడు దిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.63.32గా ఉంది. నిన్న రూ.63.62గా ఉంది.
కోల్‌కతా, ముంబయి, చెన్నై నగరాల్లో కూడా పెట్రోల్‌ ధరలు ఈ ఏడాది సరికొత్త కనిష్ఠాలకు చేరాయి. వరుసగా ఈ నగరాల్లో ఈరోజు లీటరు పెట్రోల్‌ ధర రూ.71.37, రూ.74.89, రూ.71.85కు చేరుకున్నాయి. లీటరు డీజిల్‌ ధర నేడు కోల్‌కతాలో రూ.65.07గా, ముంబయిలో రూ.66.25గా, చెన్నైలో రూ.66.84గా ఉన్నాయి. నిన్న ఈ నగరాల్లో వరుసగా డీజిల్‌ ధరలు రూ.65.37, రూ.66.57, రూ.67.16గా ఉన్నాయి.