తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్‌
జయశంకర్‌ భూపాలపల్లి,మే4(జ‌నం సాక్షి ):  వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని,రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్‌ డి.అమయ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో వరిధాన్యం తడిచినందున రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ, పంటల బీమా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… తడిచిన వరిధాన్యం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌, జీసీసీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దన్నారు. అలాగే, రైతుల నుంచి తడిచిన వరిధాన్యం కొనుగోలుకు వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా చర్యలు చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజారాంను ఆదేశించారు. అలాగే, రైతులు పంట నష్టం వివరాలు తెలియజేసేందుకు 18002669725 టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశామని, ఈ నెంబర్‌కు రైతులు ఫోన్‌ చేసి పంట బీమా మొత్తం పొందవచ్చునని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ భాస్కరన్‌, డీఆర్‌వో మోహన్‌లాల్‌, డీఏవో అనురాధ, పంటల బీమా అధికారి మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. కొన్ని మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఫలితంగా కోయటానికి సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కళ్లాల వద్ద ఉన్న తమ ధాన్యం వర్షానికి తడిసి ముద్ద కావటంతో రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.