తనయుడిని పోలీసులకు అప్పగించిన బీజేపీ ఎమ్మెల్యే

భోపాల్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నేత, పార్లమెంటు సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవిఖటిక్‌ మంగళవారం క్షమాపణలు చెప్పారు. సింధియాను కాల్చిచంపుతానంటూ సోమవారం ఆమె కుమారుడు ప్రిన్స్‌దీప్‌ ఖటిక్‌ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని ఉమాదేవి స్పష్టం చేశారు. మంగళవారం తన కుమారుడిని స్వయంగా వెంటబెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరూ ఇలా ప్రవర్తించకూడదని, ప్రిన్స్‌దీప్‌ జైలుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నేనే అతడిని తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చానని, ఈ వ్యవహారంతో నా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా మధ్య ప్రదేశ్‌లోని హట్టాలో సింధియా అడుగుపెడితే కాల్చిపారేస్తానంటూ ప్రిన్స్‌దీప్‌ సోమవారం ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా ఝాన్సీరాణిని చంపిన జివాజీరావు రక్తమే నీలో ప్రవహిస్తోంది.. నువ్వు హట్టాలో అడుగుపెడితే కాల్చిపారేస్తా, అయితే నువ్వైనా చస్తావ్‌.. లేకుంటే నేనైనా చస్తా…’ అంటూ ప్రిన్స్‌దీప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దామో జిల్లాలోని హట్టా పట్టణంలో బుధవారం జరిగే ర్యాలీలో సింధియా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే తనయుడు ఇలా వ్యాఖ్యానించడంపై కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన బీజేపీ ఎమ్మెల్యే తన తనయుడిని స్టేషన్‌లో అప్పగించింది.