తన వ్యాఖ్యలతో రాజకీయ లబ్దికి ప్రయత్నమా?

కాంగ్రెస్‌పై మండిపడ్డ నితిన్‌ గడ్కరీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): తన వ్యాఖ్యలతో రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న వ్యాఖ్యలను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలుచేస్తోందని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలుచుకోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దేశ పురాతన పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పురాతన పార్టీకి చౌకబారు రాజకీయాలు గుర్తింపుగా మారడం దురదృష్టకరం. కాంగ్రెస్‌ అబద్దాలను ప్రచారం చేస్తోంది. ఇతరులను దెబ్బతీసే విషయంలో కాంగ్రెస్‌ తన రికార్డును తానే బద్దలు కొడుతోంది’ అని గడ్కరీ ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ఆదివారం నితిన్‌ గడ్కరీ ఓ సమావేశంలో మాట్లాడుతూ..’కుల రాజకీయాల పై నాకు నమ్మకం లేదు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే, తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారు’ అని వ్యాఖ్యానించారు. వెంటనే దానిపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్‌..’ఇది ప్రధాని నరేంద్ర మోదీ పై గడ్కరీ చేసిన ప్రత్యక్ష దాడి’ అంటూ ట్వీట్‌ చేసింది. ‘మత రాజకీయాలకు వ్యతిరేకంగా గడ్కరీ మాట్లాడుతున్నారు. కానీ అదే భాజపా విధానం’ అంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. అలాంటి రాజకీయాలు చేసే వారిపై ఆయన ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు స్వపక్షం భాజపా, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది.