తమది దృఢమైన ప్రభుత్వం

– 2014కు ముందు మనదేశ పరిస్థితి ప్రస్తుతం శ్రీలంకలోలా ఉండేది
– దేశ భద్రత విషయంలో ఐదేళ్లలో కఠినంగా వ్యవహరించాం
– ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఐదేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు పటిష్ఠ భద్రత కల్పించామని, వారికి అన్ని విధాల అండగా నిలిచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్రలోని డిండోరిలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శ్రీలంకలో చర్చిలు, పలు ¬టళ్లలో జరిగిన బాంబు దాడులకు 290 మంది బలయ్యారు. దీనిని గుర్తుచేసిన ప్రధాని నరేంద్ర మోదీ 2014కు ముందు భారత్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందని అన్నారు. రోజువిడిచి రోజు దేశంలో ఏదో ఒక మూలన పేలుళ్లు జరుగుతూనే ఉండేవని, పుణె, ముంబయి, గుజరాత్‌లో జరిగిన దాడులను ఉద్దేశించి మోదీ కాంగ్రెస్‌ విూద విమర్శలు చేశారు. పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదం విూద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్‌, ఎన్‌సీపీ విూద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ తాము అనుభవజ్ఞులమని చెప్పుకొంటాయని, దాడులు జరిగినప్పుడు సంతాప సభలు నిర్వహించడం, ప్రపంచ వేదికల విూద పాకిస్థాన్‌ గురించి ఫిర్యాదులు చేయడం మాత్రమే చేసేవారని ఎద్దేవా చేశారు.
తాను ప్రధాని అయ్యాక పరిస్థితులు చాలా మారిపోయాయని మోదీ అన్నారు. ఈ చౌకీదార్‌కు అధికారం కట్టబెట్టాక, పాకిస్థాన్‌  ప్రేరేపిత ఉగ్రవాదం విూద దాడి చేశామన్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం కనిపిస్తుందని వెల్లడించారు. దేశ భద్రత విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని, తమది దృఢమైన ప్రభుత్వమని మోదీ వివరించారు.