తమను మోసం చేసిన వ్యాపారులపై..
చర్యలు తీసుకోవాలి
– ఎనుముల వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతుల ఆందోళన
వరంగల్, జులై2(జనం సాక్షి ) : పంటలు కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా మోసం చేసిన వ్యాపారులపై.. చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతూ.. వరంగల్ లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుమ ముట్టడించారు. వర్థన్నపేట , రాయపర్తి మండలాలకు చెందిన రైతులు.. ప్రధాన గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో వచ్చిన రైతులతో మార్కెట్ నిండిపోయింది. మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాపారుల మోసంపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేశారు. తోట విశ్వేశ్వర్, శ్రీధర్, మరి కొందరు వ్యాపారులు గ్రామాల్లో తిరిగి.. పంటకు ఎక్కువ ధర ఇస్తామని నమ్మించారని, నమ్మకస్తులుగా నటించారన్నారు. అలా రూ.50 కోట్ల సరుకులు రైతుల నుంచి తీసుకుని మోసం చేశారని, పంటలు కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా తప్పించుకుంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోలని డిమాండ్ చేశారు. వ్యాపారులు తమకు ఇచ్చిన చెల్లని చెక్కులు, కాగితాలతో పాటు.. పురుగు మందుల డబ్బులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. సావలి అనే మహిళా రైతు.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో తోటి రైతులు ఆమె చేతిలో పెట్రోల్ డబ్బా లాగేశారు. పోలీసులు, మార్కెట్ పాలకవర్గం అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని హావిూ ఇవ్వడంతో ఆందోళనను రైతులు విరమిచారు.