తల్లిని తుపాకితో కాల్చిన చిన్నారి
– అమెరికాలో విషాధ ఘటన
వాషింగ్టన్, ఫిబ్రవరి5(జనంసాక్షి) : గర్భవతి అయిన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీటెల్కు చెందిన 8 నెలల గర్భిణి తన ప్రియుడితో కలిసి టీవీ చూస్తోంది. ఆ సమయంలో పక్క గదిలో ఆడుకుంటున్న వారి కొడుకుకు బెడ్ కింద తుపాకీ దొరికింది. ఆడుకుంటూ తల్లి వద్దకు వచ్చిన చిన్నారి వెనుక నుంచి ఆమె తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చిన్నారి తండ్రి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే ఈ కేసులో చిన్నారి తండ్రి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కింగ్స్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ ప్రతినిధి రియాన్ అబాట్ తెలిపారు. కాగా తమ వద్ద ఉన్న తుపాకీని భద్రపరచని పక్షంలో ఎవరైనా దానిని ఉపయోగించినట్లైతే.. తుపాకీ యజమానే శిక్ష అనుభవించాల్సి ఉంటుందనే తీర్మానంపై వాషింగ్టన్ ఓటర్లు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా బాలుడి తండ్రి ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని రియాన్ తెలిపారు. అయితే ఆ గన్ తన స్నేహితుడిది అని అతడు చెప్పాడని.. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. గన్కల్చర్ను రూపుమాపే క్రమంలో ఇటువంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.