తల్లిపాల శ్రేష్టతపై అవగాహన

 

తల్లిపాల శ్రేష్టత వారోత్సవాల సందర్భంగా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ కాకతీయ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల శ్రేష్టత వారోత్సవాల సందర్భంగా కాలనీలోని చంటి బిడ్డ తల్లులకు అవగాహన సదస్సు సింగరేణి హెల్త్ ఎడ్యుకేషన్ టీం వారు నిర్వహించారు. ఈ సదస్సులో సింగరేణి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. లోకనాథ్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ పసిబిడ్డ తల్లులకు తల్లిపాల విశిష్టత గురించి అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోగా తల్లి ముర్రు పాలు కచ్చితంగా పట్టించాలని తెలియజేశారు. ఆరు నెలలు వరకు తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, బిడ్డకు కనీసం రెండు ఏళ్ల వరకు ఆహారంతో పాటు తల్లిపాలను పట్టించాలన్నారు. తల్లిపాలు తాగిన పిల్లలు చురుకుగా ఆరోగ్యంగా ఉంటార ని తెలియజేశారు. అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావనీ, తల్లి పాలలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయన్నారు. ఎటువంటి అంటూ వ్యాధులు సోకకుండా ఉంటాయని రోజుకు కనీసం ఎనిమిది సార్లు తల్లిపాలు పట్టించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కలవల రామ్మోహన్, అంగన్వాడి టీచర్స్ సుజాత, విక్టోరియా, ఏఎన్ఎం మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.