తెరాస ఓటమే మా లక్ష్యం


– ప్రశ్నిస్తామనే కేసీఆర్‌ తమను పక్కన పెట్టారు
– తాము బేషరతుగానే కాంగ్రెస్‌లో చేరుతున్నాం
– బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం
–  విలేకరుల సమావేశంలో కొండా దంపతులు
– సురేఖకు ప్రచార కమిటీలో స్థానం కల్పిస్తాం – ఉత్తమ్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కొండా సురేఖ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కొండా దంపతులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాహల్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కొండా సురేఖ విూడియాతో మాట్లాడుతూ… తాము బేషరతుగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు చెప్పారు. తెరాస తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వరంగల్‌ జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తామని రాహుల్‌తో చెప్పినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రాహల్‌గాంధీని మళ్లీ కలుస్తామన్నారు. తెరాసలో కేసీఆర్‌ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి.. బీసీ నేతలను అణగదొక్కుతున్నారని కొండా మురళి ఆరోపించారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్‌ చేసిందేవిూ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న
ఆలోచనతోనే తాము ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతా తిరిగి, ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… తమ కుటుంబానికి రెండు, మూడు సీట్లు అడుగుతున్నామని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. తమలాంటి బలమైన నేతల పార్టీలో ఉంటే ప్రశ్నిస్తారనే భయంతోనే తమను టీఆర్‌ఎస్‌ పక్కన పెట్టిందని చెప్పారు.
ప్రచార కమిటీలో స్థానం కల్పిస్తాం – ఉత్తమ్‌
కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొండా దంపతులు బేషరతుగానే పార్టీలో చేరారని తెలిపారు. వారికి కేటాయించే సీట్లపై ఇంకా చర్చింలేదని,  స్థానిక నేతలతో చర్చించిన తర్వాతే సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సురేఖ ప్రచార కమిటీతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. ఈ మేరకు ప్రచార కమిటీలో స్థానం కల్పిస్తామని ఉత్తమ్‌ తెలిపారు.